Monday, June 30, 2008

అణు ఒప్పందం మీకు అంగీకారమేనా ?

అమెరికా ఇండియా దేశాల మధ్య అణు ఒప్పందం జరగాలని, వద్దని రెండు విధాలుగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు?
నాకు తెలిసినంతవరకూ అమెరికా పాకీస్థాన్ వైపూ, రష్యా ఇండియా వైపూ ఉండేవి. ఇండియా అలీనదేశాలకు నాయకత్వం వహిస్తుంది.ఇప్పుడు అమెరికా మన విద్యుత్ అవసరాలను కోసం అణువిద్యుత్తు తయారుచేసుకునే పరిజ్ఞానాన్ని మనకు ఇవ్వడానికి తహతహ లాడుతుంది. ఎందుకు?
ఈ అణు ఒప్పందం అమలు 4 దశలుగా జరగాలి. 1.అణుఇంధనాన్ని సప్లై చేసే గ్రూపు ( NSG ) మన దేశంతో చర్చించి అంగీకారం తెల్పాలి. 2.అంతర్జాతీయ అణు సంస్ధ ( IAEA ) ) మన దేశంతో చర్చించి అంగీకారం తెల్పాలి. ( ఇప్పుడు జరగబోయే సీను ఇదే.)3. భారతదేశ కేంద్ర ప్రభుత్వం అమెరికా షరతులకు అంగీకరించాలి. 4. పై మూడు ఒప్పందాలను పరిశీలించాక అమెరికా పార్లమెంటు అంగీకరించి చట్టం చెయ్యాలి.
ఇప్పటివరకూ 25 దేశాలతో అమెరికాకు అణు ఒప్పందం కుదిరింది. వాటిల్లో కమ్యూనిష్టులు అభిమానించే చైనా దేశం కూడా ఉంది. మరి కమ్యూనిష్టులు ఈ అణు ఒప్పందాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఆ 25 పెద్దదేశాలు సంతకాలు చేసి అంగీకారం తెల్పిన తర్వాత 2007లో Hyde చట్టాన్ని అమెరికా తయారుచేసి అమెరికా కాంగ్రెస్ లోని రెండు సభలూ ఆమోదించింనాయి, అమెరికా ప్రసిడెంటు జార్జి బుష్, కూడా సంతకం చేసాడు. దానికంటే ముందు 2005 జూలై నెలలో మన ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అణు ఒప్పందం విషయం బుష్ ప్రతిపాదించాడు. 2006 మార్చి లో ఢిల్లీలో భారత ప్రధాని మనమోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. మనం చాలా ఆనందించాం, ఆశ్చర్యపోయాం ఎందుకు ఆయాచితంగా ఈ వరాన్ని ప్రసాదిస్తున్నారా అని. తర్వాత తెల్సిందేమిటంటే ఇరాన్ దేశం నుండి పాకీస్థాన్ , ఇండియా మీదుగా చైనా దేశానికి గ్యాసు పైపు లైను నిర్మించి , తక్కువ ధరకు గ్యాసు మనకు లభించేలాగా, తక్కువ ఖర్చుతో మనం విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగలిగేలాగా చైనా, పాకీస్థాన్ , ఇరాన్ లతో మనం ఒక ఒప్పందం చేసుకొని ఉన్నాం. ఈ ఒప్పందాన్ని చెడగొట్టాలని అమెరికా ఎత్తుగడ పన్నింది. పాకీస్థాన్ ఎటూ అమెరికా మాట కాదనదు, మరి మనల్ని ఒప్పించాలంటే ఈ ఉచిత అణువిజ్ఞానబదలాయింపు అనే అస్త్రం ద్వారా మనల్ని పడగొట్టింది. ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా మనచేత ఐక్యరాజ్యసమితిలో ఓటు వేయించింది. వెనుకబడిన దేశాలతోఒప్పందంగా భావించి, Hyde చట్టాన్ని దీనితో జతచేశారు.Hyde చట్టం ప్రకారం మనం ఇతర దేశాలతో చర్చలు జరపాలంటే అమెరికా అధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ఏసమయంలో అయినా తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇలా ఈ Hyde చట్టం లోని సెక్షన్ 103, 104, D2 మొదలైనవి భారతదేశానికి ఇబ్బంది కలిగించే అంశాలు. “ చట్టంలో అలా వుంది గానీ నేను ఆ అధికారాన్ని వినియోగించను ” అని జార్జి బుష్ గారు అంటున్నారు.
మన దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఈ అణు ఒప్పందం బాగానేవుంది అన్నారు. కానీ మనదేశ అణుశాస్త్రవేత్తలు ఈ ఒప్పందాన్ని తిరస్కరించారు. ప్రస్తుతం మైనారిటీగావున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఆమోదం పొందకుండా భారతదేశ సార్వభౌమాధికారాన్ని మరోసారి తెల్లవానికి తాకట్టుపెట్టడం మంచిదంటారా?

Thursday, June 26, 2008

మీ కలల్ని నిజం చేస్తాం

ఒక రోజు సుబ్బారావుకు కలొచ్చింది. అందులో తననెవరో చంపినట్లుగా వచ్చింది. రాత్రంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఉదయాన్నే బాంకుకి వెళ్ళి తన ఖాతా క్లోజ్ చేసి , అందులో వున్న డబ్బంతా ఇచ్చేయమన్నాడు .
" ఏమయిందండీ ? ఎందుకు ఖాతాను క్లోజ్ చేస్తున్నారు? " అని వాళ్ళు ఎంత అడిగినా చెప్పలేదు.
డబ్బు డ్రా చేసుకున్నాక వెళ్ళబోతుండగా మళ్ళీ అడిగారు.
" ఇప్పుడైనా చెప్పండి సార్! కారణం "
" రాత్రి నన్ను ఎవరో చంపినట్లు కలవచ్చింది. అందుకే... " అన్నాడు సుబ్బారావు ' మీ కలల్ని నిజం చేస్తాం' అని వున్న ఆ బాంకు ప్రకటన బోర్డును చూపిస్తూ.

Tuesday, June 24, 2008

తెలుగులో విద్యా బోధన ఎందుకు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం మనదేశంలో ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు ప్రవేశపెట్టింది. మాతృభాషలోనే బోధన జరగాలని మనం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వొప్పించాం. ఫలితంగా ఆయా రాష్టాల్లో ఆయా మాతృభాషల్లోనే విద్యాబోధన జరిగింది. స్వాతంత్ర్యానంతరం మన మాతృభాషల్ని మనం సుసంపన్నం చేసుకోవడానికి ప్రయత్నిచాలి. అంతేగానీ ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రవేశపెట్టకూడదు.
మాతృభాషలోనే విద్యాబోధన జరిగితే విషయం (subject) బాగా అర్ధం అవుతుంది. అదే ఇంగ్లీషు మీడియంలో చదివిన పిల్లలకు కంటెంటు అర్ధంకాదు. ఇంగ్లీషు మీడియం లో చదివితే ఇంగ్లీషు బాగా మాట్లాడగలుగుతారనే నమ్మకం మనలో చాల మందిలో ఉంది. కానీ ఇంగ్లీషులో బాగా మాట్లాడగలగడానికి, ఇంగ్లీషు మీడియంలో చదువునేర్చుకోవడానికి సంబంధం లేదు. ఇంగ్లీషు మీడియంలో చదివినవారినీ , మాతృభాషా మీడియంలో చదివినవారినీ పరీక్షించి చూసినప్పుడు మాతృభాషా మీడియంలో చదివినవారికి పాఠ్యాంశాల విషయఅవగాహన బాగా ఉందని తెలిసింది. మన ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు నిజానికి కోళ్ళఫారాల్లాగుంటాయి. తెలుగు మీడియంలో అరకొరగా చదివినవారే బోధకులు. వారే ధారాళంగా ఇంగ్లీషులో మాట్లాడలేరు. ఇక పిల్లలకేం చెప్పగలరు? -కేరళ ఉపాధ్యాయులచే బోధన- అని ప్రకటనలు ఇస్తూవుంటారు. వారి ప్రొనౌన్షియేషన్ చాలా తప్పులతడక. వారికి కొన్ని పదాలు పలకవు. వాస్తవానికి ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యం వలన గాక, యాజమాన్యం వారి సమర్ధత ద్వారా ప్రయివేటువారికి పేరు వస్తుంది. ప్రయివేటు యాజమాన్యాలవారి ఎత్తులు జిత్తుల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదని భావిస్తున్నాను.
అయితే కొన్ని కార్పోరేట్ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చక్కని బోధన జరుగుతుంది. ఆ పాఠశాలల్లో సీటు దొరకడం చాలా కష్టం. మూడున్నరేళ్ళ వాడు ఇంగ్లీషు మాతృభాషగా గల వానివలే ఇంగ్లీషులో మాట్లాడగలిగి వుండాలి. బహు కఠినమైన ఇంటర్వ్యూను ఆ చిన్నారులు ఎదుర్కొనాల్సివుంటుంది. అతని పేరు పిలవగానే తన తల్లిదండ్రులను వదలి ఒక్కడే ప్రిన్సిపాల్ గదిలోనికి వెళ్ళాలి, ఇంగ్లీషులో ఆ ప్రిన్సపాల్ గారితో మాట్లాడాలి. ఆల్ఫాబేట్సూ, నంబర్లూ, కలర్సూ చెప్పగలిగివుండాలి. ఆ ఇంటర్వ్యూలో నెగ్గితేనే – సీటు. చూడండి. ఆ వయసులో ఆబాలుడి పోరాటం. దానికై ఆ తల్లిదండ్రులెంత డ్రిల్లింగ్గిచ్చారో. ఒక పశువుకి సర్కస్ ఫీట్లు నేర్పడంకన్నా ఇది మరింత ఘోరం.
కనుక తెలుగు మాతృభాషగా గలవాడు ఇంగ్లీషు మీడియంలో చదవలేడు, ఒకవేళ చదివినా పాఠం అర్ధంకాదు. శాస్త్రీయ దృక్పధంతో ఆలోచించినప్పుడు మాతృభాషా మాధ్యమంలో చదివినవారు చక్కని అవగాహనా నైపుణ్యము గలవారిగానూ, విద్యావంతులుగానూ తయారౌతుండగా – ఇమాజినరీ ఇంగ్లీషు మీడియంలో చదివినవారు విషయ జ్ఞానశూన్యుడై, బైహార్టు చేసి , పరీక్షలలో గట్టెక్కేవారుగావుంటున్నారు, అందువలన 1వ తరగతినుండి 10వ తరగతి వరకు గణితం, సైన్సు, సోషలు సబ్జక్టులు మాతృభాషలోనే బోధించాలి. ఆంగ్లభాషను ‘ డిస్కోర్సు మెథడులో ’ బోధించితే వారు ఇంగ్లీషు భాషను చక్కగా, అనర్గళంగా మాట్లాడగలిగేవారుగా తయారౌతారు.
కనుక ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీషుమీడియం లో బోధించాలనుకోవడం ప్రజలకు మేలు చేస్తున్నామని భ్రమపడి, వారికి కీడు చేయడమే. బాలల విద్యాహక్కును నిరాకరించబోవడం ప్రాథమిక హక్కుల వుల్లంఘనే అని చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం.
State సిలబస్ లో పాఠాలు మన రాష్ట్రానికి సంబంధించినవి, ఉదాహరణకు- మన రాష్ట్రం, ఉనికి, మన ఆహారపుటలవాట్లు, పంటలు, మన పండుగలు ఇలా... వుంటాయి. అదే సెంట్రల్ సిలబస్సయితే మన దేశానికి సంబంధించి పాఠాలుంటాయి. State సిలబస్ లో తెలుగు మీడియంలోని పాఠాలే ఇంగ్లీషులోకి ట్రాన్సిలేట్ చెయ్యబడి వుంటాయి.కనుక టీచర్లు తేలిగ్గా చెప్పగలమసుకుంటారు. అదే సెంట్రల్ సిలబస్సయితే క్రొత్త పాఠాలు , క్రొత్త మీడియమాఫ్ ఇన్సష్ట్రక్షన్ , ఇన్నాళ్ళూ తెలుగు మీడియంలో చదివి, తెలుగు మీడియంలో చెప్పి, ఇప్పుడు, ఇంగ్లీషు మీడియంలో కొత్త పాఠాలు చెప్పమంటుందీ ప్రభుత్వం, వాఁ..... అంటూ వారంరోజుల్లో ఇంగ్లీషులో బోధించడం నేర్చుకొని ఈ వయసులో ఎలా చెప్పాలో తెలియక కొందరు టీచర్లు జుట్టు పీక్కుంటున్నారు.

Monday, June 23, 2008

ఇంగ్లీష్ మీడియం లో బోధన

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన ఆధీనంలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో 6వ తరగతి నుండి బోధించాలని నిర్ణయించుకోవడం విచారకరం. కొంతమంది ప్రజలు , కొన్ని ఉపాధ్యాయ సంఘాలు దీనిని అపార్ధం చేసుకుంటున్నారు. కొందరు ఇంగ్లీషు మాధ్యమానికి ( మీడియానికి ) ఓకే. కానీ అది స్టేట్ సిలబస్ లో అయితేనే చెబుతాం అంటున్నారు. మరి కొందరు కొత్తగా ఇంగ్లీషు మీడియం పెట్టినప్పటికీ తెలుగు మీడియం ఎలాగూ ఉంది గనుక , ఇంగ్లీషు మీడియంలో చదవడం ఇష్టం లేని వారు తెలుగు మీడియంలోనే చదువుకోవచ్చుగదా , మరింకేమిటి – సెంట్రల్ సిలబస్ అయితే మాత్రం ఏం - అంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఇంగ్లీషు మీడియం పెట్టడం మంచిది కాదు. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు మాతృభాషలో విద్య నేర్చుకోవడం మంచిదని కొఠారీ కమీషన్ కూడా సూచించింది. బాగా కోపం తెచ్చుకున్నకొందరైతే – మీ ఉపాధ్యాయుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదవాలా ? పాపం పేదల పిల్లలు మాత్రం తెలుగులో చదవాల్నా? ఏం న్యాయంజెబుతున్నారండీ..... అంటూ నిరసిస్తున్నారు. దయచేసి వారు అర్దం చేసుకోవలసినదేమిటంటే ప్రయివేటు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాలున్నాయి. వాటిల్లో చేరి చదువుకోవచ్చు. కానీ ప్రభుత్వము తనంతట తానుగా , నిస్సిగ్గుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం విడ్డూరం, రాజ్యాంగ విరుద్ధం.

Friday, June 20, 2008

సమయస్ఫూర్తి

అనగాఅనగా ఒక అడవిలో ఒక సింహం, ఒక నక్క రాజూ, మంత్రిగా ఉండేవారు. ఒకసారి సింహం జంతువులను వేటాడుతూవుండగా ప్రమాదవశాత్తు కాలికి గాయమైంది. క్రమేపీ ఆ గాయం బాగా నొప్పిచేసి , నడవలేక తన గుహవద్దనే ఉండిపోయింది. సింహం ఏదైనా జంతువుని వేటాడి చంపి తాను తినగా మిగిలింది తింటూ జీవనం గడుపు కుంటున్న నక్కకు కూడా ఏమీదొరక్క ఆకలితో అలమటిస్తుంది. సింహం వేగంగా పరుగెత్తలేకపోతుంది. దాంతో జంతువులేవీ దానికి దొరకడంలేదు. కాలినొప్పితోపాటు ఆకలికూడా పెరగడంమినహా మరేమీ ప్రయోజనం కన్పించడంలేదు. దాంతో సింహం నక్కను పిలిచి ఇలా అంది. “ చూస్తున్నావుగా మంత్రీ ! ఏదైనా జంతువు నాదగ్గరకు వస్తేతప్ప నేనేంచెయ్యలేను. ఏదైనా ఉపాయం చెప్పు ” అంది. “ చూస్తూ చూస్తూ తమ దగ్గరికి రావడానికి ఎన్ని గుండెలుండాలి ? ..సరే. నా ప్రయత్నం నేను చేస్తాను. తమరు మాత్రం ఎవరికీ కనిపించకుండా ఆ గడ్డిలో దాక్కోండి. నాకెవరైనా కన్పిస్తే వారికి మాయమాటలు చెప్పి ఇక్కడికి వచ్చేలా చేస్తాను. అది ఇక్కడికి రాగానే దాన్ని చంపేయండి. ” అంది. అలాగే అంటూ ఎత్తైన గడ్డిలో దాక్కుంది మృగరాజు.
అలా కొంతదూరం వెళ్ళేసరికి కొన్ని గాడిదలు గడ్డి మేస్తూ కనిపించాయి. మెల్లగా వోగాడిద్దగ్గరికి వెళ్ళింది నక్క. “ గాడిద బావా ! గాడిద బావా ! అక్కడ ఎంత మంచి గడ్డి ఉందనుకున్నావ్ ? ఇదేం గడ్డయ్యా బాబూ ! పైగా అక్కడ ఓ ఆడగాడిద కూడా ఉంది ” అంది. “ నిజంగానా? ” అంది గాడిద. “ నిజమే. నీమీదొట్టు. రా! చూపిస్తాను” అన్నది నక్క. సరేనంటూ నక్కవెనుకే వెళ్ళింది గాడిద. “ అదుగో! ఆ పొద వెనుకే వుంటుంది వెళ్ళు ” అంది నక్క ఆనందంగా. దగ్గరికొస్తున్న గాడిదను చూస్తూనే గాండ్రు మంటూ అరిచి దాని పైకి దూకబోయింది. సింహగర్జన వినగానే హడలిపోయి వెనుదిరిగి పారిపోయింది గాడిద. నక్కకి బాగా కోపమొచ్చింది. “ ఏమిటి స్వామీ! ఇలా చేశారు? మీరు ఎందుకలా అరిచారు?” నిష్టూరంగా అంది నక్క. “ మేము వేటాడే పధ్దతి అంతేగా మిత్రమా! ఏదో అలవాటుగా వచ్చింది. మేం ధర్మయుధ్దం చెయ్యాలిగా ” అంది సింహం. నక్కకు బాగా కోపం వచ్చింది. “ ఇక ఊరుకోండీ. ఏం ధర్మమండీ. ఇప్పటి మీ పరిస్థితి ఏమిటి? వారం రోజులుగా పస్తులుంటున్నాం. ఈ పరిస్థితుల్లో కూడా నీతీ, న్యాయం, ధర్మం అంటుంటే ఎట్లా ప్రభూ!.... అరెరెరెరే.... నోటిదాకా వచ్చిన ఆహారాన్ని చేజేతులా పాడుచేసారు. ఏం చేస్తాం. మీరు, మిమ్మల్ని నమ్ముకున్నందుకు నేనూ ఇలా ఆకలితో మలమల మాడి చావాల్సిందే. ” అంది నక్క. “ పోనీ, మళ్ళీ తీసుకురా. ఈ సారి శబ్దం చేయకుండా పని పూర్తిచేస్తాను ” అంది సింహం. “ సరే! ఈ సారి మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి ” అంటూ వెళ్ళింది నక్క.
మళ్ళీ అదే గాడిద ఓ చెట్టు క్రింద కనిపించింది. ఇది మన మాటలు మరి నమ్ముతుందా? చూద్దాం అనుకుంటూ ఆ గాడిద దగ్గరకు వెళ్ళి పొట్ట చేత్తోపట్టుకొని పకపకా నవ్వుతూ క్రిందబడి దొర్లసాగింది. “ ఏమిటి ? నవ్వుతున్నావ్? ” అంది గాడిద. “ ఏం ధైర్యవంతుడవయ్యా! అహహ్హా! అది నిజం సింహమనుకున్నావా? అ హహ్హ! కాదు. అదే.... ఆడగాడిద.... నువ్వు ఎంత ధైర్యవంతుడవో అని...ఊరికే.... హాస్యానికి. కాస్తయినా నిదానించి చూడకుండా అదే పరుగా? ...అహహహ్హా... అదీ...నువ్వు బాగానచ్చావట... ఏంటి? .... నేను చెప్పాన్లే... ఆయన నిజంగా భయపడలేదూ..హాస్యానికి అలా పరుగాత్తివుంటాడని చెప్పన్లే.....అవునా? ......అహహ్హ.... నేనప్పుడే అనుకున్నాన్లే..నువ్వు కూడా హాస్యానికే అలా పరుగెత్తావ్. నిజంగా సింహమే అయితే అది నీవెంట పరుగెత్తేదిగదా? ...ఏమంటావ్? ” అంది నక్క. “ అవును. నిజమే. అది నిజం సింహమైతే నావెంట పరుగెత్తేదేగదా... నాకూ అనుమానంగానే వుంది....అయినా ఆ అరుపు వినగానే కొంచం భయమేసింది. ”అంది గాడిద సిగ్గు పడుతూ. “ సరేలే పద అక్కడ నీకోసం ఎదురు చూస్తుంది. ” అంటూ గాడిదను వెంటబెట్టుకు పోయింది నక్క.
గాడిద పొదవైపు నడుస్తుండగనే గడ్డిలో దాక్కున్న సింహం నిశ్శబ్దంగా గాడిదపై దూకి పదునైన తన పంజాతో రెండు దెబ్బలు కొట్టింది. దాంతో తల పగిలి మెదడు, రొమ్ము పగిలి గుండె బయటపడి గాడిద చచ్చింది. “ చూసావా మిత్రమా! అన్నమాటను ఎలా నిలబెట్టుకున్నానో. చాలా రోజులుగా సరైన భోజనం లేదు. ఈ రోజు తృప్తిగా భోజనం చెయ్యాలి. నేను ఆనదిలో స్నానం చేసి వస్తాను. నే వచ్చేంతవరకూ జాగ్రత్తగా ఇక్కడే ఉండు ” అన్నాడు మృగరాజు. “ చిత్తం ప్రభూ! మీరు నిశ్ఛింతగా వెళ్ళిరండి. దీనిపై ఈగ కూడా వాలకుండా నేను కాపలాకాస్తాను. ” అంది నక్క. సింహం స్నానానికి వెళ్ళాక ఆ మెదడు, గుండె చూస్తుంటే దానిక నోట్లో నీళ్ళూరాయి. ఎప్పుడూ సింహం తినగా మిగిలినదేదో తినడమేగాని ఎప్పుడూ ఆ మెదడూ, గుండే తిని ఎరుగను. ఇదే మంచి తరుణం, మించిన దొరకదు. అనుకొని ఆ గుండె, మెదడు చక్కగా, తృప్తిగా ఆరగించింది. ఒకవేళ సింహానికి కోపం వచ్చినా తన వెంటబడి పరుగెత్తేంత శక్తి దానికి లేదు. కనుక ఏమీ ఎరుగనట్లు నిబ్బరంగా కూర్చొనివుంది నక్క.
సింహం స్నానం చేసి వచ్చింది తనకెంతో యిష్టమైన మెదడు, గుండె తిందామంటే లేవు. “ ఏమిది మిత్రమా! దీని మెదడు, గుండే ఏమయ్యాయి? నువ్వ గాని తిన్నావా? ” కోపంగా అడిగింది సింహం. “ అయ్యో! రామ రామ! ఎంత మాటన్నారు? ఎప్పుడైనా తమరు తినకుండా నేను తినెరిగుండానా? తమ సేవకుణ్ణి. తమరు తిని వదిలివేసిన దాన్ని తిని బ్రతికేదాన్ని.అంత సాహసం చెయ్యగలనా? బహుశా ప్రభూ! దీనికారెండూ వుండుండవు. ” అంది నక్క నమ్మకంగా. “ నిజమా? జంతువన్నాక అవి లేకుండా ఎలా వుంటాయి? ” అంది సింహం. “ దాన్దేముంది ప్రభూ! ఎంతోమంది వికలాంగులుగా పుడుతున్నారు. ఒకవేళ దీనికి ఆగుండే వుండుంటే , తమరు దాన్ని చంపుతూంటే మెదలకుండా వుంటుందా? ఎదురుతిరగదూ? మరి దానికామెదడే ఉండివుంటే ఒకసారి పారిపోయింది మళ్ళీ రెండోసారి వస్తుందా? అయినా ఇవన్నీ తమకు తెలియని సంగతులా ప్రభూ? ” అన్నది నక్క. సింహంకూడా నక్కచెప్పిన మాట కాదనలేకపోయింది.

Wednesday, June 18, 2008

ఉపయోగాలు

ఉపాధ్యాయుడు : ఒరేయ్! రామూ! నువ్వు చెప్పరా. శరీర భాగాల ఉపయోగాలేమిటి?
రాము : తల ...... తాకట్టు పెట్టుకోడానికి, కళ్ళు...... కుట్టుకోడానికి, చెవి....... కోసుకోడానికి, ముక్కు...... పిండి బాకీలు వసూలు చేసుకోడానికి, నోరు..... మూనుకోడానికి, పళ్ళు...... రాలగొట్టుకోడానికి, గడ్డం...... పట్టుకొని బ్రతిమలాడటానికి, గొంతు...... చించుకోడానికి, గుండెలు...... బాదుకోడానికి, కడుపు..... చించుకోడానికి, చేతులు..... పట్టుకొని బ్రతిమలాడడానికి, కాళ్ళు....... పట్టుకొని క్షమించమనడానికి ఉపయోగపడతాయి మాస్టారూ!
ఉపాధ్యాయుడు : ఆ.......!