కీ.శే. జాన్ డేవిడ్ అయ్యవారు

Oct 19, 2008



దేవుని దూత వలే పేదలకు, వికలాంగులకు, వ్యాధిగ్రస్తులకు, అనాధలకు కొండంత అండగా నిలిచిన డాక్టర్. జాన్ డేవిడ్ అయ్యవారు ప్రభుసన్నిధికి చేరి మూడేళ్ళయింది. చిలకలూరిపేటకు త్రాగునీటి కొరత లేకుండా చేసిన ఈ దయార్ధ హృదయుడు జనవరి తొమ్మిదవతేదీ 2005 న ప్రభువునందు నిద్రించినారు. 1950 – 60 మధ్య కాలంలో చిలకలూరిపేట చుట్టుప్రక్కల గ్రామాలలో తరచుగా తిరుగుతూ దేవుని సువార్తను బోధిస్తుండేవారు. వేకువ ఝామునే ఆయా గ్రామాలలో తిరుగుతూ బూరలో అరుస్తూ దేవుని ప్రవచనాలు చెబుతూండేవారు. “ దేవుని రాకడ సమీపించింది , ప్రియులారా! మారుమనస్సు పొందండి. “ అంటూ ప్రచారంచేసేవారు. మా పల్లె లోని పెద్దలు మమ్మల్ని ఆయన వద్దకు వెళ్ళనిచ్చేవారుకాదు. ‘ వాళ్ళది మన లాగానే క్రీస్తు మతమే గానీ , అది వేరే గ్రూపు. కాబట్టి మనం వారి దగ్గరకు పోకూడదు ‘ అని చెప్పేవాళ్ళు. కానీ మా పల్లె నుండి డాక్టర్. వంజా. జ్ఞానానందం గారి కుటుంబం, దైవసేవకులు గట్టుపల్లి. ఆర్యారావు గారి కుటుంబం, ఇలా నాలుగైదు కుటుంబాలవారు జాన్ డేవిడ్ అయ్యవారి సమాజంలో చేరారు.
జాన్ డేవిడ్ అయ్యవారు 17 అక్టోబర్ 1926 న విశాఖపట్టణం జిల్లా, నర్సిపట్టణం తాలూకా, బల్లిఘట్టం గ్రామంలో గాబ్రియేల్ , కృపమ్మ దంపతులకు జన్మించారు.చిన్న తనంలోనే తండ్రి మరణించినందున తల్లి సంరక్షణలో పెరిగి, మిలిటరీలో పనిచేశారు. తరువాత దైవసేవ చేస్తూండగా దేవుడు తనకు జీవితసహచరిగా ఆణిముత్యము వంటి డాక్టర్. సత్యవేదమ్మ గార్ని బహుమతిగా ఇచ్చాడు. వీరికి ఒక కుమారుడు , నలుగురు కుమార్తెలు కలిగారు. వారిలో ఒక కుమార్తె చనిపోయారు, మరొకరు విదేశాలలో ఉంటున్నారు, మిగిలిన ఇద్దరు కుమార్తెలూ, కుమారుడూ సేవ చేస్తున్నారు.
జాన్ డేవిడ్ అయ్యవారు ఆంగ్లభాష నుండి తెలుగులోకి విదేశీ సువార్తీకుల ప్రసంగాల్ని తర్జుమా చేసి చెబుతుండేవారు. జాన్ డేవిడ్ అయ్యవారు మరియు సత్యవేదమ్మ డాక్టర్ దంపతులను దేవుడు బహుగా దీవించినందున విదేశముల నుండి విరాళములు తెచ్చిమన రాష్ట్రములో అనేక ప్రాంతములందు సేవాకార్యక్రమములు నిర్వహించారు. 1952లో A.M.G. అనే సంస్థను స్థాపించారు. కంటి వైద్యశాలలు, క్షయ వ్యాధి నివారణ కేంద్రాలు , కుష్ఠు వ్యాధి నివారణ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, అనేక విద్యాసంస్థలు స్థాపించి అందులో అనాధలకు ప్రాధాన్యత నిచ్చారు. వేసవిలో పాఠశాలలకు సెలవులు ఇవ్వగానే పిల్లలందరూ వారివారి ఊళ్ళకు వెళతారు. కానీ తల్లీతండ్రీ బంధువులూ ఎవ్వరూ లేని అనాధ పిల్లలు మాత్త్రం హాస్టల్ లోనే ఉంటారు. ఆసమయంలో జాన్ డేవిడ్ అయ్యవారు ఏదేశంలో ఉన్నప్పటికీ , ఎన్ని పనులున్నప్పటికీ వాటన్నిటినీ ప్రక్కనబెట్టి ఇండియా వచ్చి ఆపిల్లలకు మంచి పిండివంటలు వండించి పెట్టి వారితో ఆడుతూపాడుతూ గడుపుతారు. అనాధల యడల వారి ప్రేమకు ఇది నిదర్శనం.
వీరు అనేక అవార్డులు ,ప్రశంసాపత్రాలు పొందారు. 1979,1982,1986,1994,1998లలో అప్పటి రాష్ట్ర గవర్నర్లచే ఉత్తమ సేవాఅవార్డులు అందుకున్నారు. 1995లో రాష్ట్రపతిచే జాతీయ బాల సంక్షమ అవార్డును అందుకున్నారు. అమెరికా తానా మహాసభలోకూడా ఉత్తమ సంఘసేవా అవార్డును అందుకున్నారు. పలు పట్టణాలు , గ్రామాలలో త్రాగునీరు, మురుగు కాల్వల అభివృద్ధి, పేదల గృహనిర్మాణము వంటి సేవాకార్యక్రమాలు నిర్వహించారు. జర్మనీ దేశస్తుడైన డాక్టర్. డైక్ మెన్ గారి ద్వారా కోట్లాదిరూపాయల వితరణనందించారు. యానాదులకు, పారిశుధ్య పనివారలకు, బాలకార్మికులకు, వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలకు , గిరిజనులకు అనేక పధకాల ద్వారా సహాయాన్ని అందించారు. ప్రతి సంవత్సరము దాదాపు 75 వేలమందికి సహాయము అందిస్తున్నారు. ఇందిర ఆవాస యోజన కార్యక్రమము ద్వారా నిర్మిస్తున్న గృహములకు 8వేల రూపాయల వంతున సహాయం అందించారు. ఆత్మహత్యలు చేసుకున్న వ్యవసాయదారుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించి , వారి పిల్లలకు ఉచిత విద్యను ఏర్పాటు చేసారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు నిరాశయులైన కుటుంబాలను ఆదుకున్నారు. రైతులకు ఉచిత పశుగ్రాసాన్ని అందించారు. త్సునామీ బాధితులకు లక్షలాదిరూపాయలు సహాయం అందించుచూ హఠాత్తుగా ప్రభువునందు నిద్రించారు. చిరస్మరణీయులైన వారి జ్ఞాపకార్ధం ఒక శిలావిగ్రహం నిర్మించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
www.amg-india.org/community.html
Share this article :

5 comments:

  1. ఎంతో దయామయులు, సహృదయం గల వారు శ్రీ డేవిడ్ గారు. ఎంతో మంది అనాధలు, పేదలు వారి నుండి లబ్ది పొందారు. కొంత మంది నేడు చాలా చాలా ఉన్నత స్తితి లో ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసులు వారిని తమ తమ జీవితాంతం మరువ లేరు, జాలరు.

    ReplyDelete
  2. జాన్ డేవిడ్ గారు పేదలకు, అనాధలకు చేసిన సేవలు నిజంగానే గుంటూరు జిల్లా ప్రజలు ఎప్పటికీ మరువలేరు. అంతే కాక ఆయన ఒక మొబైల్ హాస్పిటల్ ని ఒక లాంచీలో ఏర్పాటు చేసి గోదావరిలో లాంచీలు, పడవల్లో ప్రయాణించే వారికి,ఆ సమీప గ్రామాల్లోని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించే ఏర్పాటు చేసారని ఎక్కడో చదివి ఆశ్చర్యపోయాను. అవును, సేవా భావానికి ఎల్లలెక్కడున్నాయి?

    వారి పాఠశాలల్లో చదివి ఉన్నత స్థ్యాయికి చేరిన అనేకమంది గుంటూరు జిల్లాలో కోకొల్లలు. నిజమైన ప్రభు సేవకులంటే ఇలాంటి వారే!

    ReplyDelete
  3. కృష్ణారావుగార్కి,కనుమూరి గార్కి, సుజాతగార్కి వందనాలు

    ReplyDelete
  4. ప్రియులారా! మారుమనస్సు పొందండి.

    చిరస్మరణీయులైన దేవుని దూత జాన్ డేవిడ్ గారికి జోహారులు

    Thanks a lot for Introducing a great personality to us.

    ReplyDelete

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||