అమెరికా వీసా ఫీజు పెంపులో హ్రస్వదృష్టి -ది హిందు

Dec 30, 2015




అమెరికా వీసా ఫీజు పెంపులో హ్రస్వదృష్టి -ది హిందు


[Short-sighted hike in U.S. visa fee శీర్షికన ది హిందులో వెలువడిన సంపాదకీయానికి యధాతధ అనువాదం]


**********

అమెరికాలో తాత్కాలిక పని కోసం వచ్చే వృత్తిగత నిపుణులకు వీసా ఫీజు పెంచుతూ బారాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐ.టి రంగంలోని భారతీయ కంపెనీలను ప్రభావితం చేస్తుంది. ఈ చర్య వల్ల సంవత్సరానికి 400 మిలియన్ డాలర్ల (రమారమి రు. 2640 కోట్లు) నష్టం వస్తుందని (భారత సాఫ్ట్ వేర్) వాణిజ్య సంఘం నాస్కామ్ (NASSCOM) అంచనా వేసింది. ‘అమెరికకన్ ఉద్యోగాలు విదేశీయులు కొల్లగొట్టేస్తున్నార’న్న భయాందోళనలు రాజకీయ ఉపన్యాసాల్లో అనివార్య భాగంగా మారే అధ్యక్ష ఎన్నికలు (2016) సమీపిస్తున్న నేపధ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
నిర్దిష్ట కేటగిరీకి చెందిన H1B మరియు L1 వీసాల జారీ ఫీజులను రెండు రెట్లు చేసి వరుసగా 4,000, 4,500 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించిన 1.8 ట్రిలియన్ డాలర్ల పన్నులు మరియు వ్యయం బిల్లు ఒబామా సంతకంతో చట్టంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం ఇండియాలో ఆందోళన కారకమైంది.


పెట్టుబడి మిగులు కలిగిన దేశాలు తమ పెట్టుబడికి తేలికపాటి ప్రవేశం ఉండాలని కోరుకున్నట్లే, -1.25 బిలియన్ల జనాభాలో 65 శాతం పైగా 35 సంవత్సరాల పైబడిన వారిని కలిగిన- ఇండియా కార్మికులు/ఉద్యోగులు స్వేచ్ఛగా (సరిహద్దులు దాటి) కదలగల పరిస్ధితులను కోరుకుంటుంది. ప్రతీకార చర్యలు తీసుకోవడానికి లేదా డబల్యూ‌ టి‌ ఓ కమిటీని ఆశ్రయించడానికి ఇండియాకు అవకాశాలు ఉన్నప్పటికీ, ఈ వీసా ఫీజు పెంపు ఇతర పోటీదారు దేశాలతో పోల్చితే భారతీయ సంస్ధలపై వివక్షాపూరిత ప్రభావం కలిగిస్తుందని రుజువు చేయాల్సి ఉంటుంది. అమెరికా చర్య భారత ఐ.టి రంగాన్ని పెద్దగా ప్రభావితం చేయదని ఇన్ఫోసిస్ లాంటి బడా ఐ.టి కంపెనీలు చెప్పిన నేపధ్యంలో అది సవాలుతో కూడుకున్నట్టిది. దెబ్బకు దెబ్బ తరహాలో చర్యలు తీసుకోవడం అంటే 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యాన్ని చంపివేయడమే.

US visa fee hike అమెరికా మరియు భారత విధాన కర్తలు పూర్తి స్ధాయి దృష్టితో పరిశీలన చేయాలి. కార్మికుల మిగులు కలిగిన దేశంగా ఇండియా, అధిక దారిద్ర్య స్ధాయిలు (దాదాపు 30 కోట్ల మంది దరిద్రులు -అమెరికా మొత్తం జనాభాతో దాదాపు సమానం- రోజుకు 1 డాలర్ సంపాదనతో బతుకుతున్న దేశం) కలిగిన దేశంగా ఇండియా క్రమానుగతంగా పెట్టుబడుల ప్రవాహంపై నిబంధనలు సడలించవలసిన అవసరం ఉండగా, పెట్టుబడి సంపదలనూ (రిటైర్ అవుతున్న ఉద్యోగులు పెరిగిపోతున్న నేపధ్యంలో) కార్మికుల కొరతనూ కలిగి ఉన్న అమెరికా కార్మికుల కదలికపై నిబంధనలను ఈ రోజో రేపో ఎత్తివేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అవి కోట్ చేసే రేట్ లను బట్టి మాత్రమే కాకుండా పనిని పూర్తి చేసి చూపడంలో అత్యంత సామర్ధ్యం కలిగినవిగా కూడా భారతీయ ఐ.టి సేవల కంపెనీలను తమ సొంత కార్పొరేషన్లే గుర్తిస్తాయన్న సత్యాన్ని అమెరికా అధికారులు, విధాన కర్తలూ గుర్తెరగాలి.

మరీ ముఖ్యంగా, సెప్టెంబర్ 2015 నాటి నాస్కామ్ నివేదిక ఎత్తి చూపినట్లుగా అమెరికన్ వ్యాపారాలకూ మరియు ఇతర కస్టమర్లకూ సేవలు అందించే భారత్ ఆధారిత ఐ.టి కంపెనీలు 2011-2013 మధ్య 2 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడమే కాక అమెరికా ట్రెజరీకి 22.5 బిలియన్ డాలర్ల పన్నులు చెల్లించాయి; నిజానికి అమెరికాలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 411,000 ఉద్యోగాలను కల్పించాయి; వాటిలో 300,000 ఉద్యోగాలను అమెరికా పౌరులు మరియు (భారత్ మూలాలు కలిగిన) శాశ్వత నివాసులు పొందారు. ఇదే కాలంలో భారతీయ ఐ.టి కంపెనీల లోకోపకార (దాన ధర్మాల) కార్యకలాపాల ద్వారా 120,000 మంది అమెరికన్లు లబ్ది పొందారు. ఈ కార్యకలాపాలను మరింత మంది అమెరికన్లకు సైన్స్, టెక్నాలజీ, ఇంజరీంగ్, మేధమెటిక్స్ (STEM) లలో నైపుణ్యం పెంచే విద్యాభివృద్ధిలో కేంద్రీకరించాయి. ఈ చందా కార్యకలాపాలు ఒక ఎత్తు కాగా, గ్లోబలీకరణ చెందే ప్రపంచం మరింత స్వాతంత్రాన్ని కోరుకుంటుందే గానీ ఎత్తైన గోడలను కాదు అంటూ అమెరికా తరచుగా ఇతరులకు బోధించే గొప్ప అంశాన్ని తాను స్వయంగా పాటించి తీరడం మరొక ఎత్తు.

***********

[ఈ సంపాదకీయం రెండు విధాలుగా ప్రాధాన్యత కలిగి ఉన్నది.

ఒకటి: ఎంతటి ప్రగతిశీల భావజాలం కలిగి ఉన్నప్పటికీ పెట్టుబడిదారీ వాణిజ్య సంబంధాల చట్రానికి పరిమితమై పరిశీలన/విశ్లేషణ చేసినప్పుడు అది చివరికి పెట్టుబడిదారీ సంపన్నుల ప్రయోజనాలను నెరవేర్చే విధంగానే తీర్పు ప్రకటిస్తుంది. 

రెండు: భారతీయ ఐ.టి కంపెనీలు అమెరికాకు చేస్తున్న సేవ. అమెరికాలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించడం అంటే మాటలు కాదు.
పైగా 22.5 బిలియన్ డాలర్లు లేదా రు 1.485 లక్షల కోట్ల పన్నులు (సం.కి 0.495 
లక్షల కోట్లు చెల్లించి  అమెరికా కోశాగారాన్ని నింపడం అంటే ఇంకా మాటలు కాదు. 

అమెరికాకి ఇంతేసి పన్నులు చెల్లిస్తున్న భారతీయ ఐ.టి కంపెనీలు ఆర్జిస్తున్న లాభాలు ఏ మేరకు ఉంటాయో ఊహించవలసిందే. 
మన ప్రజల కంపెనీలు (ప్రభుత్వరంగ కంపెనీలు) అమ్మేసి సం.కి 40 వేల కోట్లు, 50 వేల కోట్లు సంపాదించాలని మన పాలకులు బడ్జెట్ లలో చూపిస్తూ ఉంటారు. 

అంతకంటే ఎక్కువ మొత్తాన్ని భారతీయ ఐ.టి కంపెనీలు అమెరికన్ బడ్జెట్ కు వాస్తవ ఆదాయంగా జమ కట్టడం అంటే మాటలా మరి? ఇలాంటి డబ్బునే దేశంలో జమ చేయడంలో చైనా పాలకులు కృతకృత్యులు అవుతుంటే భారత పాలకులు ఘోరంగా విఫలం అవుతున్నారు. ఎక్కడుంది తేడా? ఎక్కడుందంటే చైనా పాలకులు జాతీయ పెట్టుబడిదారులు కాగా భారత పాలకులు దళారీ పెట్టుబడిదారులు కావడంలోనే. దళారీ పాలకులకు ‘మా దేశం, మా సంపద’ అన్న జాతీయ స్వార్ధం ఉండదు. ‘నా బొషాణం నిండితే చాలు. దేశానికి మిగలకపోతే నాకేమి?’ అనుకోవడం దళారీ పాలకుల లక్షణం. అందుకే వారి విధానాలన్నీ సామ్రాజ్యవాద కంపెనీలకు దోచి పెట్టి వారి నుండి దళారీ కమిషన్ గుంజుకోవడంలోనే కేంద్రీకృతం అయి ఉంటాయి.]

(తెలుగు వార్తలు.కాం)


Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||