ప్రజాస్వామ్యమంటే ప్రజల నుండి, ప్రజల కొరకు , ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, అంటే, అవును పైకి కన్పిస్తున్నవిధంగా ఇది ఒక్కరి చేత నిరంకుశంగా పాలింపబడడం కాదు , ప్రతి నిర్ణయం వెనుక అనేకమంది ఉన్నారు అని సంతోషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారనే ఉద్దేశ్యంతో ఈ టపా రాస్తున్నాను.
కొన్ని విషయాలు మీరు కూడా అంగీకరిస్తారు. ప్రజల కొరకు అంటే వ్యాపారుల కొరకు లేదా ధనవంతుల కొఱకు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధి ఏమని ప్రామిస్ చేస్తాడంటే ‘ వస్తువుల ధరలు పెంచకుండా వ్యాపారులనూ, ధనవంతులనూ కంట్రోలు చేస్తానని పేదలకు వాగ్దానం చేస్తాడు, అలాగే పేదలు తిరగబడి తన్నకుండా మిమ్మల్ని కాపాడుతానని ’ వ్యాపారులకూ, ధనవంతులకూ వాగ్దానం చేస్తాడు. అయితే వ్యాపారులనూ, ధనవంతుల పక్షాన్నే ఎక్కువగా ఉంటాడు.
ప్రజల నుండి అంటే ప్రజలు ఎవరైనా ఎన్నికలలో పోటీచేయవచ్చుననుకోకండి. వాడు 5వేలో 10వేలో ధరావత్తు చెల్లించగలవాడై యుండాలి. అతడ్ని ప్రపోజ్ చేసేవాళ్ళు కూడ ఉండాలి. పదివేలున్నాయిగదాని నామినేషను వేయబోయేరు గనుక , జాగ్రత్త ఇరగదంతారు. ఎప్పుడైనా ఏదైనా టెండరు వేసివుంటే గనుక అనుభవం వచ్చివుండును. గతంలో రాచరిక పద్ధతుల ప్రకారం రాజు కొడుకు రాజయ్యేవాడు. నేటి ప్రజాస్వామ్యం ప్రకారం రాజులు, వారి వారసులూ, భూస్వాములూ, జమీందారులూ వారి ప్రాంతాలనుంచే కాకుండా దేశంలో ఎక్కడ నుంచైనా పోటీచెయ్యవచ్చునని అర్థం. నేడు చాలామంది రాజకీయాలను అపార్థం చేసుకుంటున్నారు. నేను పార్టీలో ముందునుంచీ ఉన్నానుగదా, చిరు సినిమా రిలీజుకు పోష్టర్లు కట్టానుగనుకా... ఇవి పోటీ చేయడానికి క్వాలిఫికేషన్స్ కావు.
ప్రజల చేత అంటే మనంతా మనకు నచ్చిన భూస్వామినో, ధనవంతుడినో , జమీందారునో ఓటు ద్వారా ఎంచుకోవచ్చు. కనుక లోకసత్తాలాంటి మాటల పార్టీవాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించడం దండగ. ( డబ్బు గలవారికి సీటు ఇచ్చిఉండకపోయుంటే )
ఇది పేరుకి ప్రజాస్వామ్యమే గాని నిజంగా ప్రజా ప్రతినిధులు పరిపాలనా విషయాల్లో కలుగజేసుకోరు. నిర్ణయాన్ని పైవారికే వదిలేస్తారు. ఒక రాజు ఎడల సేవకుడు ప్రవర్తించినట్లు లొంగుబాటు ప్రదర్శిస్తారు. తమ క్రింది వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుతూంటారు. తెలంగాళా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం సోనియాగారే చేయాలని కోరడానికి కారణం ఇదే. దేశానికి రాజు లేక రాణి సోనియా అనుకుంటే , ఆ స్థాయిలో గతంలో పోటీ పడిన పి.వి., శరద్‌పవార్,సంగ్మా వంటివారు దీనికి ఉదాహరణ. మన రాష్ట్రంలో వైయ్యస్సు కు డియ్యస్సు, హనుమంతు, వగైరాలు పోటీ . వీరిలో ఎవరినైనా ముఖ్యమంత్రిగా ఎంచుకొని అధికారం అప్పగించే అవకాశం సోనియా వద్ద ఎప్పుడూ ఉంటుంది. అలాగే మన జిల్లాల్లో మంత్రులుగా ఎంచుకునేందుకు ప్రతి ప్రాంతం నుండి నలుగురైదుగురుంటారు . వారిలో ఎవరో ఒకర్ని ఎంచుకునే స్వేచ్చ వైయ్యస్కు ఎప్పుడూ ఉంటుంది. అధికారం అలా అంచలంచలుగా పైకీ క్రిందికీ నిర్మాణమై యుంటుంది. ప్రతి ప్రాంతంలో ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి పైస్థాయికి సంబంధించిన ఆయానాయకుల తాలూకూ ప్రాతినిధ్యం ఉండాలి. అంటే వైయస్సార్ తాలూకూ ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులూ, డియ్యస్కు సంబంధించిన ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులూ .... ఇలా నిర్మాణం ఉంటుంది. కాబట్టి ఆయా స్థాయీలలో ఎల్లప్పుడూ నాయకత్వంకై పోరాటం జరుగుతూ ఉంటూంది. అంటే ప్రతి నాయకుడికీ ఓ గాడ్‌ఫాదర్ పైస్థాయిలో ఉండాలి . కాబట్టి ఓటువేసే ప్రతివ్యక్తికి కూడా పైస్థాయిలో ఓ నాయకుడు కావాలి. అంటే మన వీధిలో లేక వార్డులో ఉన్న ఛోటా నాయకులలో ఎవర్నో ఒకర్ని మనం ఎంచుకోవాలి. అతనితో ఇలా చెప్పాలి. సార్. మీరు ఎవరికి ఓటు వెయ్యమంటే మేము వారికి వేస్తాము. మీరు ఎప్పుడు ఎ మీటేంగుకు రమ్మంటే అప్పుడు మా పని మానుకుని వస్తాము. ( దానికి పేమెంటు అతడిస్తాడు . డోంట్ వర్రీ ) మాకు ఏదైనా ప్రభుత్వసహాయం కావాల్సివచ్చినా మీరు ఇప్పించాలి. రౌడీలనుంచీ , పోలీసులనుంచి మమ్మల్ని కాపాడాలి. అని మనం ఓ అణు వొప్పందం లాంటి అగ్రిమెంట్ చేసుకోవాలి . నేనెందుకు ఓటెయ్యాలి అని ఎవరైనా నిర్లక్షంగా ప్రవర్తిస్తే వాళ్ళకే నష్టం . మనం కూడా ఓమాదిరి నాయకుడిలాగా మారాలి. మన ఇంటిప్రక్కన ఉండేవాళ్ళని బాగా మంచిచేసుకుని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి మన కంట్రోలులో పెట్టుకోవాలి . కనీసం నలుగురైదుగురుతో ఓజట్టు కడితే తద్వారా మన వీధి నాయకుడి నుంచి మంచి గౌరవం లాభం పొందవచ్చు. ఇది ఒకటవ రాజకీయ పాఠం. ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి వ్యాఖ్యానంతో సంప్రదించండి.
సదా మీ సేవలో ,
ఇట్లు,
మీ ఏరియా రింగ్ మాస్టర్.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !