( శ్రీశ్రీ రాసిన ‘నవ కవిత’కు జరుక్ శాస్త్రి రాసిన పేరడీ ‘ సరదా పాట ’ 9వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉంది. ‘ నవ కవిత ’ ( శ్రీశ్రీ ) ను, ‘ సరదా పాట ’ ( జరుక్ శాస్త్రి ) ను తులనాత్మక పరిశీలన కోసం 9వ తరగతి విద్యార్ధుల దృష్టిలో పెడితే - ఎం. వెంకటేష్ అనే విద్యార్ధి స్పందనే ఈ వ్యాసం ) - సం.
శ్రీశ్రీ నవకవిత మనకు గుండెల్లో చైతన్యాన్ని ప్రసరిస్తుంది. జరుక్ శాస్త్రి రాసిన సరదా పాట వింటుంటే నవకవిత దగ్గర పనికిరాని కవితలా అనిపిస్తుంది. శ్రీశ్రీ రాసిన నవకవిత ఎంతో ఆసక్తికరంగా ఉంటే జరుక్ శాస్త్రి రాసిన పేరడీ సరదాపాట – శ్రీశ్రీ రాసిన నవకవితను ఎగతాళి చేసింది. శ్రీశ్రీ రాసిన నవకవిత వింటుంటే ఒక విధమైన కదలికల్ని ఇస్తుంది. జరుక్ శాస్త్రి రాసిన పేరడీ వింటుంటే చెడ్డ కవితలా అనిపిస్తుంది.
శ్రీశ్రీ నవకవితకు సింధూరం తీసుకుంటే జరుక్ శాస్త్రి ఆవకాయ , పెసరప్పడం సరదా పాటకు తీసుకున్నారు. సింధూరం ఎర్రగా అన్నిటికన్నా ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. అది ఉదయించే సూర్యునికి చిహ్నం .అలాంటి సింధూరాన్ని శ్రీశ్రీ నవకవితకు తీసుకొని ఆకవితకు ప్రాముఖ్యం కలుగజేయాలనుకున్వాడు. జరుక్ శాస్త్రి ఆవకాయ , పెసరప్పడం తీసుకున్నాడు. ఈయన రాసినవి తిండిపోతు ఆలోచనలను పెంచుతుంది.
జరుక్ శాస్త్రి సరదాపాట ద్వారా తెలిసిందేమిటంటే- శ్రీశ్రీని చులకనగా చేయడం. శ్రీశ్రీ నవకవిత జీవితానికి ఉపయోగపడుతుంది. జరుక్ రాసిన పేరడీని ఎవరూ పట్టించుకోరు.
నవకవితకు ఎగతాళిగా ,చులకనగా జరుక్ శాస్త్రి రాశాడు. ఇటువంటి కవితలను రాయడానికి జరుక్ శాస్త్రికి ఎలా బుద్ధి పుట్టింది? పులి చంపిన లేడి నెత్తురు శ్రీశ్రీ నవకవితకు తీసుకుంటే జరుక్ తెగిపోయిన పాత చెప్పులూ, పిచ్చోడి ప్రతాపం కోపం సరదాపాటకు సామానులుగా తీసుకున్నాడు. పులిచంపిన లేడి నెత్తురు పులిమీద కోపంతో ఉంటుంది. జరుక్ సరదాపాట పిచ్చోడి వాగుడులాగుంది. కాబట్టి మనం వాటిని తెగిపోయిన పాతచెప్పుల్లా బయటకు పారవేయాలి. పిచ్చోడు తన పరిధిలో తాను నడుచుకోలేడు. అలాంటి వాడి కోపం దేనికి పనికివస్తుంది? పిచ్చోడిని అందరూ పట్టించుకోరు. అదేవిధంగా జరుక్ శాస్త్రిని కూడా.
శ్రీశ్రీ కవిత వినడానికి చురుక్కుమంటుంది. ఇంకా వినాలనిపిస్తుంది. జరుక్ పేరడీ చెత్తగా ఉంటుంది. నవకవితకు శ్రీశ్రీ రుద్రాళిక, నయనజ్వాలిక, కలకత్తా కాళిక నాలిక తీసుకుంటే- జరుక్ శాస్త్రి వైజాగ్ లో కారాకిళ్ళీ సామానుగా తీసుకున్నాడు. రుద్రమదేవి కళ్ళల్లో మంటలు దుర్మార్గుల్ని చీల్చినంత వేగంగా ఉంటాయి. కలకత్తా కాళికా దేవి యొక్క నాలిక శత్రువుల్ని చీల్చగలిగే సామర్ధ్యం కలిగిఉంటుంది. వాటిని త్రోసి, ఉల్లంఘించి జరుక్ శాస్త్రి వైజాగ్ లో కారాకిళ్ళీ సామానులుగా తీనుకున్నాడు. వైజాగ్ లో కారాకిళ్ళీ ఎలా ఉంటుందో నాకు తెలియదుగానీ కిళ్ళీ అనేది ఒక చెడు వ్యసనమని తెలుసు.
శ్రీశ్రీ నవకవిత పిల్లలను ఉత్తేజపరచి, మంచివారుగా మారాలని చెబుతుంటే , సరదాపాట పిల్లలకు చెడ్డ భావాలను చెబుతుంది.. సరదాపాట అంటే సరదాగా మనసు వికసించేలా ఉండాలి కానీ ; ఈ సరదాపాట ఒకరిని ఎగతాళిచేసి రాసి, వారిపై చులకన భావం చూపింది.
శ్రీరంగం శ్రీనివాసరావు – ఘాటెక్కిన గంథక ధూమం, పోటెత్తిన సప్తసముద్రాలు నవకవితకు తీసుకున్నాడు. జరుక్ తుప్పుపట్టిన మోటారు చక్రం, తగ్గించిన చిమ్నీ దీపం తీనుకున్నాడు. ఘాటెక్కిన గంధక ధూమం చూస్తే దానికి చాలా శక్తి ఉంటుంది. ఏడు సముద్రాలు పోటెత్తినప్పుడు చూస్తే ఉప్పొంగి కనిపిస్తుంది. అలాంటి వాటిని శ్రీశ్రీ నవకవితకు తీసికొని దుర్మార్గులను భయాందోళనలకు గురిచేయాలనుకున్నాడు. అలాంటివాటిని ప్రక్కన పెట్టి జరుక్ శాస్త్రి తుప్పుపట్టే మోటారు చక్రం తీసుకొని ఏమిచెయ్యాలనుకున్నాడు? పిల్లలను భవిష్యత్తులో బాగు చెయ్యాలని లేదా?
శ్రీశ్రీ – వికశించిన విద్యుత్తేజం నవకవితకు తీసుకున్నాడు. విద్యుత్తు వేగం వికశించినప్పుడు కళ్ళకు ఒక విధమైన చైతన్యం కలుగుతుంది. అలాంటి వాటిని విడిచి జరుక్ శాస్త్రి మహ ఊరిన రంపప్పొట్టు సామానుగా తీసుకున్నాడు. రంపప్పొట్టు మహ ఊరినప్పుడు చెడువాసన వస్తుంది. అలాంటి రంపప్పొట్టు దేనికి పనికివస్తుంది . అందుకే అతని కవితలు కూడా మహ ఊరిన రంపప్పొట్టులా చెడుగా ఉన్నాయి. కవితలు అంటే మనసుకు వికాసాన్నీ , ఆనందాన్నీ కలిగించాలి.
శ్రీశ్రీ చెలరేగిన జనసమ్మర్ధం నవకవితకు కోరుకుంటే జరుక్ శాస్త్రి రాసిన సరదాపాటకు విసిరేసిన విస్తరి మెతుకులు వాడారు. శ్రీశ్రీ చెలరేగిన జనసమ్మర్ధాన్ని తీసుకొని ప్రజలను చలరేగించాలని కోరాడు. కానీ వాటిని తిరస్కరించి జరుక్ పనికిరాని విస్తరి మెతుకులు వాడాడు. ఇవి దేనికి పనికివస్తాయి?
శ్రీశ్రీ మార్చేదీ మార్పించేది అని వ్రాసి ప్రజలను కదిలించాలని ఆలోచించాడు. దానికి బదులుగా జరుక్ చచ్చేది లాభంలేనిది ఈజన్మలో పనికిరానిది అని చివరలో తేల్చిచెప్పిన సరదాపాట పిల్లలకు ఎలా పనికివస్తుంది? ఈ జన్మకేకాదు ఏజన్మలోకైనా పనికరాదని చెప్పవచ్చు. శ్రీశ్రీ పెనునిద్దుర వదిలించేది, మునుముందుకు నడిపించేది , పరిపూర్ణపు బ్రతుకిచ్చేది అని రాసాడు. అంటే నిద్రపోతున్న బద్ధకస్తులను పెనునిద్దురనుంచి మేలుకొమ్మని , విశ్వాన్ని చూడమని చెబుతున్నాడు. అలాంటి వారిని మునుముందుకు నడిపించాలనే కోరికతే రాసాడు. ఇలా చేస్తే పరిపూర్ణ బ్రతుకు వస్తుందని , మూర్ఖులను చీల్చగలిగే శక్తికలుగుతుందని అభిప్రాయం.
డాక్టర్. ఎన్.గోపి 9వ తరగతి పాఠ్యపుస్తకానికి సంపాదకులుగా ఉండి, జరుక్ మీద అభిమానమో లేదా ద్వేషమో ఈ కవిత – సరదాపాట ను పిల్లలకు అందించారు. శ్రీశ్రీ – మీదే మీదే సమస్త విశ్వం – మీరే మీరే భాగ్యవిధాతలు అని సమస్త విశ్వాన్ని పిల్లల చేతుల్లో పెట్టారు.
జరుక్ రాసిన సరదాపాట ఎన్. గోపి గారు మాచేతుల్లో పెట్టి ఏమి చేయాలనుకున్నారు?
-ఉపాధ్యాయ సౌజన్యంతో
నవకవిత- సరదాపాట – 9వ తరగతి విద్యార్ధి పరిశీలన
Mar 11, 2009
Labels:
విద్య
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !