నేటి రాజకీయం తీరుతెన్నులు చూస్తుంటే ఓ కాల్పనిక చలన చిత్రం చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ రాజకీయాలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏదేశంలోనూ ఇలాంటి పరిస్ధితులు లేవు.
కాబినెట్ లో ఒక మంత్రిని అవినీతి ఆరోపణలతో అరెష్టు చేస్తే కాబినెట్ కు దానితో ఏమీ సంబంధం లేనట్లుంటుంది. గత కాలపు సాంప్రదాయాలు నేడు మారిపోయాయి. ప్రజలు ఆశ్చర్యంగా ఓ సినిమా చూస్తున్నట్లు క్లయిమాక్సుకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు కూడా ఇలాంటివే. జగదేకవీరుడు అతిలోకసుందరి అనే చిత్రంలో హీరో కొండవీడు అనే పర్యాటక కేంద్రం లో గైడుగా పనిచేస్తూ, కొండవీడును గురించి నోటికొచ్చిన పిచ్చికధను చెబుతాడు, కొండవీడంటూ ఓ కొండగుహను చూపుతాడు. దీన్ని అర్ధం చేసుకోవడంలో ఓ చిక్కుంది. కొండవీడు అనేపేరుగల ఓ ప్రాంతం చరిత్రలో ఉంది. కానీ చిరంజీవి చూపేది చరిత్రప్రసిద్ధిగల ప్రాంతాన్ని కాదు. మరోప్రాంతంగానీ సినీసెట్టింగుగానీ కావచ్చును. కొండవీటిని గురించి అతడు చెప్పిన చరిత్ర కూడా తప్పే. రాజసింహుడనే రాజవరూ కొండవీటిని పాలించలేదు. చరిత్రప్రాధాన్యంగల కొండవీటిని గురించి అన్నీ అబద్ధాలే చెప్పడం తప్పు. అది మహాత్మాగాంధీ అంటూ అతణ్ణి గురించి ఏవేవో మాటలు చెప్పరాదుకదా... అయితే మహాత్మాగాంధీని గురించి ప్రజలకు చాలానే తెలుసు కానీ కొండవీడును గురించి బాగా తెలియదు. కనుక ప్రజలు తప్పుపట్టరు. వేదాంతం కూడా ఇలాంటిదే . ప్రజలకు తెలియని దాని గురించి మనమేమి చెప్పినా ముప్పులేదనే సూత్రం చిరంజీవి బాగా వంటబట్టించుకున్నారు. వారి సోదరుడు కూడా వారి మార్గంలోనే కొండవీడు పోలీసు స్టేషనును గబ్బర్ సింగ్ పోలీసుస్ఠేషన్ గా మార్చుకోగలిగారు.
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయితే తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలూ అయిపోయాయి. చివరకు చిరంజీవిని తన పార్టీలో చేర్చుకొని ఆతని వినూత్న కొండవీడు అస్త్రాన్ని తాను రాజకీయాల్లో ప్రయోగించడానికి సిద్ధపడింది. సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి నూతన సలహాదారుగా చిరంజీవి వ్యవహరిస్తున్నారు. అజాద్ గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినప్పుడు చిరంజీవికి అత్యున్నత స్ధాయిలో పొగిడాడు. కేంద్ర కాబినెట్ లోని మంత్రి రాజా గారిని అవినీతి అభియోగాలతో జైలులో ఉంచడం, అనేక నెలల పాటు విచారణ జరగడం, అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ లోకూడా కాబినెట్ మంత్రి అవినీతి అభియోగాలతో జైలులో ఉండాల్సిరావడం, దానితో కాబినెట్ కేమీ సంబంధం లేదనడం సాంప్రదాయాలకు భిన్నంగా ఉంది. ప్రభుత్వాన్ని నడిపే మంత్రుల బృందం పై వచ్చిన అవినీతి ఆరోపణకు వ్యతిరేకంగా ప్రభుత్వ లాయరు వాదిస్తుండగా , ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రయివేటు లాయరు వాదించాల్సిరావడం మరో మహ విచిత్రం. కొండవీడు చరిత్రని చిరంజీవి చెప్పినట్లుగా అవినీతి చరిత్రను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గానం చేస్తున్నాయి. ఈ రకం రాజకీయాలు సాధారణ ఓటరుకు అర్ధంకాదు. పైకి చూడడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిపై సమరం సాగిస్తున్నట్లుగా ఉంటూంది. రాజకీయాలు తెలిసినవారికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నపని తప్పుగా తెలుస్తుంది. రాజకీయాలు తెలిసిన ఆ తక్కువ మంది ఎటూ తమకు ఓటు వేయరు. రాజకీయాలు తెలియని అనేకమంది ఓటరులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఎత్తుగడలకు చిత్తవుతారు. ఎందుకంటే కొండవీడు అస్త్రం విజయం సాధించింది గనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా భవిష్యత్తులో విజయం సాధిస్తారు . ఈ ఆశ నిజమౌతుందా...
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నేడు అవసానదశలో ఉన్నందున ప్రతిపక్షానికి కూడా సహాయపడుతుంటాయి. ప్రతిపక్షం వారికి కొరకరాని కొయ్యలుగా ఉన్న గాలి వంటి వారిని వీరు అణగదొక్కుతారు. కనుక ప్రతిపక్షం వారేమీ మాట్లాడకుండ ఏమీ ఎరగనట్లు ఈ విషయాలు పట్టించుకోకుండా వుంటారు. ఈ ఆపరేషన్ లో తెగింపు ఉంది. ఇది ఆఖరిపోరాటం. కొండవీటి ఎత్తుగడకు ప్రతిపక్షాలు చిత్తయి వున్నాయి. దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. న్యాయవ్యవస్థకూడా ఇందుకు భిన్నం కాదు. ఒక ఉదాహరణ ఏమంటే మొదట జగన్ను అరెష్టు చెయ్యము అని , కేవలం ప్రశ్నించి పంపుతామని చెప్పిన న్యాయం గాలిబెయిలుకేసు దెబ్బకు బిక్కచచ్చూరుకుంది.
చివరకు ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డెడ్ అన్నట్లు అవుతుందేమోనని అనుమానంగావుంది.... చిన్న చిరు చెప్పినట్టు - నాక్కొంచం తిక్కుంది, కానీ దానికోలెక్కుంది అన్నట్టు ఇదేదో తిక్కలతడక ఆపరేషన్ లావుంది.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !