రోహిత్ ఆత్మహత్య: సస్పెన్షన్ ఎత్తివేత
కేంద్ర ప్రభుత్వ విశ్వ విద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రోహిత్ మిత్రులు నలుగురు రీసర్చ్ స్కాలర్ విద్యార్ధులపై స్పస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ ఎత్తివేత తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. సస్పెన్షన్ ఎత్తివేసినందున విద్యార్ధులంతా సాధారణ విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని వైస్ ఛాన్సలర్ పి అప్పారావు కోరారు.
యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియమించిన సబ్
కమిటీ గురువారం సమావేశమై సస్పెన్షన్ ను బేషరతుగా
ఎత్తివేయడానికి నిర్ణయించిందని పాలకవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది.
“యూనివర్సిటీలో నెలకొన్న అసాధారణ పరిస్ధితులను
పరిగణనలోకి తీసుకున్న పిమ్మట, సమస్యను కూలంకషంగా చర్చించి
సంబంధిత విద్యార్ధులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయడానికి
నిర్ణయించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది” అని యూనివర్సిటీ
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రకటించింది.
“అసాధారణ పరిస్ధితులు” నెలకొంటే గానీ దళిత విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి పాలకవర్గానికి మనసు రాలేదు. కానీ ఈ సందర్భంలో అసాధారణ పరిస్ధితులు అంటే ఏమిటి? రోహిత్ ఆత్మహత్య, తదనంతరం న్యాయం కోసం, సస్పెన్షన్ ఎత్తివేత కోసం విద్యార్ధులందరూ ఉమ్మడి ఉద్యమంలోకి దుమకడమే అసాధారణ పరిస్ధితులా?
అదే అయితే ఈ అసాధారణ పరిస్ధితులకు కారకులు ఎవరు? సస్పెన్షన్ ఎత్తివేత
కోరుతూ రోహిత్ తదితర ఐదుగురు బాధిత విద్యార్ధులు అప్పటికే ఆందోళనలో ఉన్నారు. తమపై అన్యాయంగా విధించిన సస్పెన్షన్ ను రద్దు చేయాలని యూనివర్సిటీ ఆవరణలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రాత్రింబగళ్ళు నిరంతర ధర్నా నిర్వహిస్తున్నారు.
ప్రజాస్వామిక పోరాట రూపాన్ని ఎంచుకుని
తెలియజేస్తున్న నిరసనలను నిన్నటివరకు లెక్కచేయని పాలకవర్గం, రోహిత్ ఆత్మహత్య
అనంతరం రాజకీయ పార్టీలన్నీ కట్టగట్టుకుని యూనివర్సిటీ
క్యాంపస్ పై వాలుతుండడం వల్లనే సస్పెన్షన్ ఎత్తివేయడానికి నిర్ణయించిందా, లేక సస్పెన్షన్
అన్యాయం అని గ్రహించి ఎత్తివేసిందా?
సస్పెన్షన్ ఎత్తివేతపై విద్యార్ధి సంఘాలు, ఉద్యమ నాయకులు, ఏఎస్‌ఏ ఇంతవరకు స్పందించలేదు. బహుశా ఈ వివరాలు లేనందు వల్లనే విద్యార్ధి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ సస్పెన్షన్ ఎత్తివేతపై స్పందించనట్లు కనిపిస్తోంది. వారు తాజా పరిణామంపై ఎలా స్పందించాలో చర్చించుకుంటూ ఉండాలి.
సస్పెన్షన్ ఎత్తివేత నిర్ణయం వెలువడడానికి ముందు వరకూ యూనివర్సిటీని అనేక రాజకీయ పార్టీల నాయకులు సందర్శిస్తూ వచ్చారు. సి.పి.ఏం నేత సీతారాం యేచూరి, సి.పి.ఐ నేత సురవరం
సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎల్.జె.పి నేత చిరాగ్ పాశ్వాన్, ఏఏపి నేత అరవింద్ కేజ్రీవాల్… ఇలా
అనేకమంది ఝుమ్ ఝుమ్ మని రొద పెడుతూ విద్యార్ధులను ఓదార్చేందుకు ప్రయత్నించారు.
ఈ నాయకులంతా చెప్పిన ఒక ఉమ్మడి మాట మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అబద్ధాలు చెబుతున్నారని. ‘ఇది దళిత-దళితేతర సమస్య కాదు’ అంటూ మొదలు పెట్టిన ఆమె ఒక అబద్ధం చెప్పి దాన్ని కవర్ చేసుకోవడానికి మరిన్ని అబద్ధాలు చెప్పారని దాదాపు నాయకులంతా చెప్పారు.
ఆమె చెప్పిన అబద్ధం: యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియమించిన సబ్ కమిటీకి నేతృత్వం వహించింది దళిత ప్రొఫెసరే అని. దళిత ప్రొఫెసర్ నాయకత్వం వహించిన కమిటీయే రోహిత్, మిత్రులకు శిక్ష విధించిందని చెప్పడం ద్వారా ఆమె ‘ఇది దళిత-దళితేతర సమస్య
కాదు’ అన్న తన స్టేట్ మెంట్ కు మద్దతు/డిఫెన్స్ తెచ్చుకోవడానికి
ప్రయత్నించారు.
కానీ అది అబద్ధం. అబద్ధంతో డిఫెండ్ చేస్తున్నారని రుజువైతే కోర్టు నిందితుడికి శిక్ష వేసేస్తుంది. సమస్య మూల స్వభావాన్ని గుడ్డిగా, మొండిగా, దురహంకారంగా నిరాకరించే ప్రయత్నంలో మంత్రిగారు ఒక అబద్ధమైన నిజాన్ని కనిపెట్టారు.
అది ప్రాసిక్యూషన్ వారు కష్టపడి రుజువు చేయాల్సిన అబద్ధం కూడా కాదు. యూనివర్సిటీ లోని దళిత ప్రొఫెసర్లతో పాటు కొందరు ఇతర ప్రొఫెసర్లు కూడా ఇది అబద్ధం అని ప్రకటించారు. తాము పాలక వ్యవస్ధలో నిర్వహిస్తున్న వివిధ బాధ్యతలు (వార్డెన్, ఎగ్జామిన్ కంట్రోలర్.. వగైరా) సస్పెండ్ అయిన దళిత విద్యార్ధులపై దాడి
చేసేందుకు మంత్రి వినియోగిస్తుండడంతో వారిలో అనేకమంది తమ పాలక పదవులకు
రాజీనామాలు ప్రకటించేశారు. దాదాపు 14 మంది ప్రొఫెసర్లు
ఇలా పాలక బాధ్యతలకు రాజీనామా చేశారని ఎన్‌డిటివి తెలిపింది.
ఈ చర్యలతో కేంద్ర మంత్రి అబద్ధం చెప్పారని తేటతెల్లం అయింది. హిందూత్వ ఒరవడిలో దళిత విద్యార్ధుల ఉనికిని దళిత విద్యార్ధి సంఘంగా రద్దు చేసే పనికి పూనుకున్న కేంద్ర ప్రభుత్వ మంత్రులు రోహిత్ ఆత్మహత్య అనంతరం కూడా అదే ఒరవడి కొనసాగించే ఊపులో అబద్ధాలు చెప్పడానికి తెగించారు.
కానీ ఈ అబద్ధం కవర్ చేసుకోవడం అసాధ్యం అయిపోయింది. డిఫెన్స్ వాదనలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. వాదనలు ఇంకా కొనసాగే కొద్దీ మరిన్ని అబద్ధాలు చెప్పక తప్పదు. లేదా డిఫెన్స్ నే మొత్తంగా ఉపసంహరించుకోవాలి.
దాని ఫలితమే సస్పెన్షన్ ఎత్తివేత. సస్పెన్షన్ ఎత్తివేతకు ‘అసాధారణ పరిస్ధితులు’ కారణంగా తెచ్చుకోవడంలోనే యూనివర్సిటీ పాలకవర్గం ముసుగులోని కేంద్ర ప్రభుత్వం తమ డిఫెన్స్ లెస్ పరిస్ధితిని వ్యక్తం చేసుకుంది. ఆ పరిస్ధితి వల్లనే అది రోహిత్ కు జరిగిన అన్యాయానికి, దళిత విద్యార్ధులకు
తాము చేసిన దురహంకార న్యాయానికి సముచిత ముగింపు ఇవ్వలేకపోతోంది.
సముచిత ముగింపు అంటే ఏమిటి? రోహిత్ + నలుగురు దళిత విద్యార్ధులతో పాటు ఏఎస్‌ఏ విద్యార్ధి సంఘం లక్ష్యంగా
సాగించిన అక్రమాలను సవరించడమే సముచిత ముగింపు.
రోహిత్ తదితర దళిత విద్యార్ధులకు తగిలించిన ‘జాతీయ వ్యతిరేక టెర్రరిస్టు’ ముద్ర పొరపాటు అని కేంద్ర మంత్రులు అంగీకరించాలి. యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై నిరసన తెలియజేస్తేనే అది ఉగ్రవాదం అయిపోదన్న కనీస జ్ఞానాన్ని, ఇప్పటికే కొందరు దళిత బి.జె.పి ఎం.పిలు చేసినట్లుగా, ప్రకటించాలి.
దళిత కులాలు ఈ దేశంలో అనాదిగా సామాజిక అణచివేతకు, లెక్కలేని అవమానాలకు, ఆర్ధిక దోపిడీకి గురవుతున్న కులాలు. కనుక వారు తమను తాము అణచివేయబడ్డవారుగా గుర్తించుకోవడం అత్యంత సహజమైన పరిణామం. అది విశ్వ విద్యాలయాల్లో జరగడం మరింత సహజం. ఒక సమూహంగా అణచివేయబడ్డవారు ఆ సమూహానికి ఉన్న గుర్తింపుతోనే తమను తాము గుర్తించుకుంటారు. అందుకే వారు కుల సమూహంగా గుర్తించుకోవడం సహజం.
కానీ ఏఎస్‌ఏ విద్యార్ధులు తమను తాము కులాలకు బదులు కులాల ఉమ్మడితనంగా గుర్తించుకున్నారు. దళితులకు ఐకాన్ గా పాలకవర్గాలే ప్రకటించే అంబేడ్కర్ ను వారు తమ ఐడెంటిటీగా ప్రకటించుకుంటూ ‘అంబేడ్కర్ విద్యార్ధి సంఘం’ ఏర్పరుచుకున్నారు.
ఇలా అంబేడ్కర్ తో ఐడెంటిఫై కావడమే కులతత్వం (castiest) గా కేంద్ర మంత్రి
బండారు దత్తాత్రేయ ఆందోళన ప్రకటించారు. ఇది బహుశా 21వ శతాబ్దానికే పెద్ద హిపోక్రసీ!
వారి కులం చూపిస్తూ వారిని దూరంగా పెడతారు; వెలివాడలకు పరిమితం
చేస్తారు; ఆర్ధిక వనరులకు దూరం చేస్తారు. కానీ వారిపై సాగుతున్న అణచివేతతోనే ఐడెంటిఫై అయితే మాత్రం అది కులతత్వం!
కులతత్వాల నుండి తమను విముక్తి చేయాలని అంబేడ్కర్ మొదలుకుని దళిత విద్యార్ధులు, సంఘాలు, కులాలు వివిధ
రూపాల్లో చేస్తున్న పోరాటాలకు వ్యవస్ధాగత పరిష్కారం చూపకపోగా వారి
పోరాటాలనే ‘కులతత్వం’గా ప్రకటించడం కంటే మించిన (ఆధునిక) కుల దురహంకారం మరొకటి
ఉండబోదు.
ఈ తప్పులను కేంద్ర మంత్రులు సవరించుకోవాలి.
రోహిత్ వేముల వారి కుటుంబానికి ఒక దివ్య భవిష్యత్తు. ఆ భవిష్యత్తును యూనివర్సిటీ పాలకులు, కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చిదిమేశారు. కనుక ఆ భవిష్యత్తును ప్రభుత్వమే పునర్నిర్మించి ఇవ్వాలి.
యూనివర్సిటీలో పెచ్చరిల్లుతున్న మతతత్వాన్ని
అరికట్టాలి. విద్యాలయాల్లో నిలువెత్తు మతత్వానికి ప్రతీక ఏబివిపి.
అయినాగాని ఆ సంఘాన్ని రద్దు చేయాలని ఏ ప్రజాస్వామికవాదీ
కోరడు. కానీ మతతత్వంతో వారు ఆధునిక సాంకేతిక వేదికలపైన కూడా దళితులను అవమానించడం, దూషించడం
అరికట్టాలి.
యూనివర్సిటీ పాలకవర్గంలో అగ్రకులాలకు ఉన్న
ప్రాధాన్యతను తగ్గించాలి. రోహిత్ ఆత్మహత్య సందర్భంగా
హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లే అగ్రకుల తత్వాన్ని ఎలా
వెలిబుచ్చేది అనేక గాధలుగా వెలుగులోకి వచ్చింది. ఈ పరిస్ధితిని
నివారించాలి.
సకల భావజాలాలను ప్రకటించుకునే స్వేచ్ఛకు ఉన్నతమైన రూపం ఇచ్చేది విశ్వవిద్యాలయమే అన్న ఎరుకతో ఎలాంటి భావజాలం పైనా, అది ఇతరులకు హాని
తలపెడితే తప్ప, ప్రకటిత మరియు అప్రకటిత నిషేదాలు అమలు కాకుండా నివారించాలి.
రోహిత్ వేముల ఆత్మహత్యకు సముచిత ముగింపు ఇచ్చే చర్యల్లో ఇవి కొన్ని
మాత్రమే.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !