అనగాఅనగా ఒక అడవిలో ఒక సింహం, ఒక నక్క రాజూ, మంత్రిగా ఉండేవారు. ఒకసారి సింహం జంతువులను వేటాడుతూవుండగా ప్రమాదవశాత్తు కాలికి గాయమైంది. క్రమేపీ ఆ గాయం బాగా నొప్పిచేసి , నడవలేక తన గుహవద్దనే ఉండిపోయింది. సింహం ఏదైనా జంతువుని వేటాడి చంపి తాను తినగా మిగిలింది తింటూ జీవనం గడుపు కుంటున్న నక్కకు కూడా ఏమీదొరక్క ఆకలితో అలమటిస్తుంది. సింహం వేగంగా పరుగెత్తలేకపోతుంది. దాంతో జంతువులేవీ దానికి దొరకడంలేదు. కాలినొప్పితోపాటు ఆకలికూడా పెరగడంమినహా మరేమీ ప్రయోజనం కన్పించడంలేదు. దాంతో సింహం నక్కను పిలిచి ఇలా అంది. “ చూస్తున్నావుగా మంత్రీ ! ఏదైనా జంతువు నాదగ్గరకు వస్తేతప్ప నేనేంచెయ్యలేను. ఏదైనా ఉపాయం చెప్పు ” అంది. “ చూస్తూ చూస్తూ తమ దగ్గరికి రావడానికి ఎన్ని గుండెలుండాలి ? ..సరే. నా ప్రయత్నం నేను చేస్తాను. తమరు మాత్రం ఎవరికీ కనిపించకుండా ఆ గడ్డిలో దాక్కోండి. నాకెవరైనా కన్పిస్తే వారికి మాయమాటలు చెప్పి ఇక్కడికి వచ్చేలా చేస్తాను. అది ఇక్కడికి రాగానే దాన్ని చంపేయండి. ” అంది. అలాగే అంటూ ఎత్తైన గడ్డిలో దాక్కుంది మృగరాజు.
అలా కొంతదూరం వెళ్ళేసరికి కొన్ని గాడిదలు గడ్డి మేస్తూ కనిపించాయి. మెల్లగా వోగాడిద్దగ్గరికి వెళ్ళింది నక్క. “ గాడిద బావా ! గాడిద బావా ! అక్కడ ఎంత మంచి గడ్డి ఉందనుకున్నావ్ ? ఇదేం గడ్డయ్యా బాబూ ! పైగా అక్కడ ఓ ఆడగాడిద కూడా ఉంది ” అంది. “ నిజంగానా? ” అంది గాడిద. “ నిజమే. నీమీదొట్టు. రా! చూపిస్తాను” అన్నది నక్క. సరేనంటూ నక్కవెనుకే వెళ్ళింది గాడిద. “ అదుగో! ఆ పొద వెనుకే వుంటుంది వెళ్ళు ” అంది నక్క ఆనందంగా. దగ్గరికొస్తున్న గాడిదను చూస్తూనే గాండ్రు మంటూ అరిచి దాని పైకి దూకబోయింది. సింహగర్జన వినగానే హడలిపోయి వెనుదిరిగి పారిపోయింది గాడిద. నక్కకి బాగా కోపమొచ్చింది. “ ఏమిటి స్వామీ! ఇలా చేశారు? మీరు ఎందుకలా అరిచారు?” నిష్టూరంగా అంది నక్క. “ మేము వేటాడే పధ్దతి అంతేగా మిత్రమా! ఏదో అలవాటుగా వచ్చింది. మేం ధర్మయుధ్దం చెయ్యాలిగా ” అంది సింహం. నక్కకు బాగా కోపం వచ్చింది. “ ఇక ఊరుకోండీ. ఏం ధర్మమండీ. ఇప్పటి మీ పరిస్థితి ఏమిటి? వారం రోజులుగా పస్తులుంటున్నాం. ఈ పరిస్థితుల్లో కూడా నీతీ, న్యాయం, ధర్మం అంటుంటే ఎట్లా ప్రభూ!.... అరెరెరెరే.... నోటిదాకా వచ్చిన ఆహారాన్ని చేజేతులా పాడుచేసారు. ఏం చేస్తాం. మీరు, మిమ్మల్ని నమ్ముకున్నందుకు నేనూ ఇలా ఆకలితో మలమల మాడి చావాల్సిందే. ” అంది నక్క. “ పోనీ, మళ్ళీ తీసుకురా. ఈ సారి శబ్దం చేయకుండా పని పూర్తిచేస్తాను ” అంది సింహం. “ సరే! ఈ సారి మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి ” అంటూ వెళ్ళింది నక్క.
మళ్ళీ అదే గాడిద ఓ చెట్టు క్రింద కనిపించింది. ఇది మన మాటలు మరి నమ్ముతుందా? చూద్దాం అనుకుంటూ ఆ గాడిద దగ్గరకు వెళ్ళి పొట్ట చేత్తోపట్టుకొని పకపకా నవ్వుతూ క్రిందబడి దొర్లసాగింది. “ ఏమిటి ? నవ్వుతున్నావ్? ” అంది గాడిద. “ ఏం ధైర్యవంతుడవయ్యా! అహహ్హా! అది నిజం సింహమనుకున్నావా? అ హహ్హ! కాదు. అదే.... ఆడగాడిద.... నువ్వు ఎంత ధైర్యవంతుడవో అని...ఊరికే.... హాస్యానికి. కాస్తయినా నిదానించి చూడకుండా అదే పరుగా? ...అహహహ్హా... అదీ...నువ్వు బాగానచ్చావట... ఏంటి? .... నేను చెప్పాన్లే... ఆయన నిజంగా భయపడలేదూ..హాస్యానికి అలా పరుగాత్తివుంటాడని చెప్పన్లే.....అవునా? ......అహహ్హ.... నేనప్పుడే అనుకున్నాన్లే..నువ్వు కూడా హాస్యానికే అలా పరుగెత్తావ్. నిజంగా సింహమే అయితే అది నీవెంట పరుగెత్తేదిగదా? ...ఏమంటావ్? ” అంది నక్క. “ అవును. నిజమే. అది నిజం సింహమైతే నావెంట పరుగెత్తేదేగదా... నాకూ అనుమానంగానే వుంది....అయినా ఆ అరుపు వినగానే కొంచం భయమేసింది. ”అంది గాడిద సిగ్గు పడుతూ. “ సరేలే పద అక్కడ నీకోసం ఎదురు చూస్తుంది. ” అంటూ గాడిదను వెంటబెట్టుకు పోయింది నక్క.
గాడిద పొదవైపు నడుస్తుండగనే గడ్డిలో దాక్కున్న సింహం నిశ్శబ్దంగా గాడిదపై దూకి పదునైన తన పంజాతో రెండు దెబ్బలు కొట్టింది. దాంతో తల పగిలి మెదడు, రొమ్ము పగిలి గుండె బయటపడి గాడిద చచ్చింది. “ చూసావా మిత్రమా! అన్నమాటను ఎలా నిలబెట్టుకున్నానో. చాలా రోజులుగా సరైన భోజనం లేదు. ఈ రోజు తృప్తిగా భోజనం చెయ్యాలి. నేను ఆనదిలో స్నానం చేసి వస్తాను. నే వచ్చేంతవరకూ జాగ్రత్తగా ఇక్కడే ఉండు ” అన్నాడు మృగరాజు. “ చిత్తం ప్రభూ! మీరు నిశ్ఛింతగా వెళ్ళిరండి. దీనిపై ఈగ కూడా వాలకుండా నేను కాపలాకాస్తాను. ” అంది నక్క. సింహం స్నానానికి వెళ్ళాక ఆ మెదడు, గుండె చూస్తుంటే దానిక నోట్లో నీళ్ళూరాయి. ఎప్పుడూ సింహం తినగా మిగిలినదేదో తినడమేగాని ఎప్పుడూ ఆ మెదడూ, గుండే తిని ఎరుగను. ఇదే మంచి తరుణం, మించిన దొరకదు. అనుకొని ఆ గుండె, మెదడు చక్కగా, తృప్తిగా ఆరగించింది. ఒకవేళ సింహానికి కోపం వచ్చినా తన వెంటబడి పరుగెత్తేంత శక్తి దానికి లేదు. కనుక ఏమీ ఎరుగనట్లు నిబ్బరంగా కూర్చొనివుంది నక్క.
సింహం స్నానం చేసి వచ్చింది తనకెంతో యిష్టమైన మెదడు, గుండె తిందామంటే లేవు. “ ఏమిది మిత్రమా! దీని మెదడు, గుండే ఏమయ్యాయి? నువ్వ గాని తిన్నావా? ” కోపంగా అడిగింది సింహం. “ అయ్యో! రామ రామ! ఎంత మాటన్నారు? ఎప్పుడైనా తమరు తినకుండా నేను తినెరిగుండానా? తమ సేవకుణ్ణి. తమరు తిని వదిలివేసిన దాన్ని తిని బ్రతికేదాన్ని.అంత సాహసం చెయ్యగలనా? బహుశా ప్రభూ! దీనికారెండూ వుండుండవు. ” అంది నక్క నమ్మకంగా. “ నిజమా? జంతువన్నాక అవి లేకుండా ఎలా వుంటాయి? ” అంది సింహం. “ దాన్దేముంది ప్రభూ! ఎంతోమంది వికలాంగులుగా పుడుతున్నారు. ఒకవేళ దీనికి ఆగుండే వుండుంటే , తమరు దాన్ని చంపుతూంటే మెదలకుండా వుంటుందా? ఎదురుతిరగదూ? మరి దానికామెదడే ఉండివుంటే ఒకసారి పారిపోయింది మళ్ళీ రెండోసారి వస్తుందా? అయినా ఇవన్నీ తమకు తెలియని సంగతులా ప్రభూ? ” అన్నది నక్క. సింహంకూడా నక్కచెప్పిన మాట కాదనలేకపోయింది.
nice story, ma kka valla pillaki cheppataniki inko manchi katha dorikesindi naku, vallaki entho kontha logic,reason untene vintunnaru, lekpoathe lite teeskuntunnaru...
ReplyDelete